: "హలో, నేను సీఎంను... మీ కాలనీకి వస్తున్నా"... ఫోన్లు చేస్తున్న కేసీఆర్
ఫోన్ రింగ్ అవుతుంది... లిఫ్ట్ చేస్తే, అవతలి వైపు నుంచి అనుకోని అతిథి గొంతు వినిపిస్తుంది. "హలో నేను సీఎంను... మీ కాలనీకి వస్తున్నా, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి?" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివిధ కాలనీల అధ్యక్షులకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇలా స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం, కాలనీలో సాధకబాధకాలపై ఆరాతీయడంతో హైదరాబాద్ పరిధిలోని వివిధ కాలనీల వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమతానగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి, వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కాలనీల్లో ఏ మేరకు పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి?, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా? డంపర్‌బిన్‌లు ఏర్పాటు చేశారా? అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాను వస్తానని, కాలనీలో పర్యటించి మిగిలివున్న సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చెప్పారట.