: ఉత్తరాఖండ్ లో సేదదీరుతున్న రాహుల్ గాంధీ... ట్విట్టర్ లో ఫొటోలు
కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో తలబొప్పి కట్టిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వారాల పాటు సెలవు మంజూరు చేయించుకున్న ఆయన ఎక్కడికెళ్లారని అంతటా ఆసక్తి. ఏ విదేశమో, లేదంటే తనకిష్టమైన కేరళో వెళ్లి ఉంటారులే అని అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ లో సేదదీరుతున్నారు. కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి విదేశాల్లో సేదదీరేందుకు రాహుల్ వెళ్లడమేంటని ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పై మాటల దాడి చేశాయి. అయితే రాహుల్ విదేశాలకేమీ వెళ్లలేదని, భారత్ లోనే ఉన్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఉత్తరాఖండ్ లో సేదదీరుతున్న రాహుల్ గాంధీ ఫొటోలను ట్విట్టర్ లో పెట్టాడు. సదరు ఫొటోల్లో... చిన్న టెంట్ వేసుకున్న రాహుల్ గాంధీ, సదరు టెంట్ ముందు కూర్చుని ఫోన్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. గడ్డాన్ని కాస్త ఎక్కువగా పెంచుకుని టోపీ పెట్టుకున్న రాహుల్ ఫొటోను కూడా ఆ కార్యకర్త పోస్ట్ చేశాడు.