: టీమిండియా వరుస విక్టరీలతో... టీవీలు, టూరిస్ట్ వీసాలకు పెరిగిన డిమాండ్
వరుస వైఫల్యాతో సతాయించిన టీమిండియా, ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ లో ఒక్కసారిగా జూలు విదిల్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పాటు పటిష్ట జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికాపై వరుసగా భారీ విజయాలు నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా టీమిండియాపై అంచనాలు పెరిగిపోయాయి. టీమిండియా ఫామ్ ను చూసి ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తుతుంటే, భారత్ లోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో టీమిండియా ఆడే మిగిలిన మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ల ముందు క్యూలు కడుతున్నారు. వెరసి ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసాలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఆస్ట్రేలియా వెళ్లి మ్యాచ్ లను వీక్షించలేని సగటు క్రికెట్ అభిమానులు, టీవీల్లోనైనా కాస్తంత మెరుగైన క్లారిటీతో టీమిండియా ప్రదర్శనను వీక్షించాలని కోరుకోవడం సహజమే. ఈ సహజమైన కోరిక నేపథ్యంలో దేశంలో ఎల్ఈడీ టీవీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్నట్టుండి ఎల్ఈడీ టీవీల విక్రయాలు పెరిగిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.