: పాక్ బోటు పేలుడు వివాదం... కోస్ట్ గార్డ్ డీఐజీ లోషాలీ సస్పెన్షన్
గుజరాత్ తీరంలో పాకిస్థానీ ఉగ్రవాదుల బోటు పేలుడు ఘటన కోస్ట్ గార్డ్ డీఐజీ లోషాలీ పదవికి గండం తెచ్చింది. దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాక్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన టెర్రరిస్టులు భారత నిఘా వర్గాలు గమనించడంతో తమను తాము పేల్చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, తీవ్రవాదులు తమను తామే పేల్చేసుకున్నారని విస్పష్ట ప్రకటన చేశారు. అయితే, ఉగ్రవాదుల బోటును తామే పేల్చామని, లేకపోతే వారికి బిర్యానీలు పెట్టాల్సి వచ్చేదని లోషాలీ వ్యాఖ్యానించారు. లోషాలీ వ్యాఖ్యలు మీడియాకు పొక్కడంతో ఒక్కసారిగా పెను వివాదం రేగింది. ఈ నేపథ్యంలో పేలుడు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన ప్రభుత్వం, లోషాలీ వ్యాఖ్యలు తప్పని తేల్చింది. అంతేకాక లోషాలీ వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. లోషాలీపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తప్పించక తప్పలేదని కోస్ట్ గార్డ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇదేమీ కొత్త విషయం కాదని, ఏ అధికారిపై విరాచణ జరిగినా ఈ తరహా నిర్ణయాలు సర్వసాధారణమని కూడా ఆ వర్గాలు తెలిపాయి.