: సెల్యూట్ చేసిన వాళ్లే చావగొట్టారు... మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ పై పోలీసుల జులుం... విరిగిన చేతి ఎముక
మొహమ్మద్ నషీద్... ఒకప్పుడు పోలీసులతో అడుగుకో సెల్యూట్ కొట్టించుకున్నారు. ఇప్పుడు అదే పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడికి జరిగిన అవమానం ఇది. ఒక కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన ఆయనను పోలీసులు ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ఆయనపై తమ ప్రతాపం చూపించారు. చావగొట్టారు. ఈ ఘటనలో ఆయన ముంజేయి ఎముక విరిగింది. చేతివేలి ఎముక కూడా విరిగినట్టు తెలిసింది. మరోవైపు కోర్టులో న్యాయమూర్తి సైతం ఆయన పట్ల జాలి చూపలేదు. వ్యక్తిగత లాయర్ ను కలవనీయకపోగా, విచారణ పూర్తయ్యేవరకూ, పోలీసుల కస్టడీలోనే ఉంచాలని ఆదేశించారు. ఈ మొత్తం ఘటనపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నషీద్ పై పోలీసుల దాడి దురదృష్టకరమని, ఆయనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని మోదీ కోరారు.