: కార్పొరేట్ గూఢచర్యంలో కీలక ఆధారాల ధ్వంసం... జైన్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం?
కార్పొరేట్ గూఢచర్యం కేసు దేశాన్ని అతలాకుతలం చేసేలా ఉంది. కీలక పత్రాల తస్కరణ, అందులో బడా పారిశ్రామిక సంస్థల ప్రతినిధుల పాత్రతో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ప్రయాస్ జైన్ భారత సర్కారుకు చెందిన పలు కీలక పత్రాలను చైనాతో పాటు పాకిస్థాన్ కు కూడా చేరవేసినట్లు వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే, ప్రయాస్ జైన్ అరెస్ట్ కు ఒకరోజు ముందు అతడి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిందట. సదరు ప్రమాదంలో కార్యాలయంలోని కీలక పత్రాలు, ఇతర విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైందట. జైన్ అరెస్ట్ కు ముందు రోజే అతడి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక ఆధారాలను ధ్వంసం చేయడం ద్వారా కేసు నుంచి బయటపడవచ్చన్న భావనతోనే జైన్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదాన్ని జరిపించి ఉంటారని విచారణాధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయాన్ని అతడి కంపెనీ ప్రతినిధి, విదేశాలకు చెందిన జైన్ క్లయింట్లకు మెయిల్ ద్వారా తెలియేశాడు. అగ్ని ప్రమాదానికి చింతిస్తున్నామని, వారంలోగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని అతడు ఆ సందేశంలో తెలిపాడు.