: షాపింగ్ లో బిజీగా రేణుకా చౌదరి!... 45 నిమిషాలు ఆగిన కేంద్రమంత్రి, జడ్జి ఉన్న విమానం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కోసం ఎయిర్ ఇండియా విమానం ఒకటి 45 నిమిషాలు ఆగింది. రేణుకా చౌదరి షాపింగ్ చేస్తూ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విమాన ప్రయాణికులలో ఒక కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా రేణుక ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడక తప్పలేదు. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. షికాగో నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం వాస్తవానికి సాయంత్రం 7 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఒక ముఖ్య ప్రయాణికురాలు రావాల్సివుందని విమాన సిబ్బంది చెబుతూ వచ్చారు. ఇంతకీ విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణమైన నాయకురాలు ఎవరా అని చూస్తే, ఆమె కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రయాణికులను విమానాశ్రయం నుంచి విమానం దగ్గరికి చేర్చేందుకు ఉద్దేశించిన బస్సు రాకనే తాను ఆలస్యంగా ఎక్కానని, ఎటువంటి షాపింగ్ చేయలేదని తెలిపారు.