: ప్రధాని, ఎన్డీయేపై యుద్ధం ప్రకటించిన అన్నా హజారే


ఎన్డీయే ప్రభుత్వంపై అన్నాహజారే యుద్ధం ప్రకటించారు. భూసేకరణ చట్టం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాలో ఆయన ఎన్డీయేపై నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికలకు మందు దేశ రాజకీయాలను దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని ఎన్నో ఆశలు కల్పించిన ఎన్డీయే ప్రభుత్వం, సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. ఎన్డీయే కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేస్తోందని ఆయన విమర్శించారు. దేశ ప్రజల భూ హక్కులపై పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా, ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ ఆంగ్లేయుల కంటే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. అలా కాకుంటే పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ జారీ చేయడమేంటని నిలదీశారు. ఎన్డీయే ప్రభుత్వం కొందరి కోసమే పనిచేస్తోందని, మెజారిటీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నో ఆశలతో ప్రజలు ప్రధానిని ఎన్నుకున్నారని, విజయం సాధించిన తరువాత అసంబద్ధ నిర్ణయాలు సరికాదని ఆయన హితవు పలికారు. గతంలో ప్రధాని చెప్పినవన్నీ గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News