: మిస్బా పిరికోడు... స్వార్థం ఎక్కువ: సంచలనం రేపుతున్న షోయబ్ అఖ్తర్ విమర్శలు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పై మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. తొలుత ఇండియాతో, ఆపై వెస్టిండీస్ పై ఘోరంగా ఓడి తదుపరి రౌండుకు చేరే అవకాశాలను క్లిష్టం చేసుకున్న ఆ జట్టుపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు విరుచుకుపడుతున్నారు. "మిస్బా చాలా పిరికి వ్యక్తి, అతనికి స్వార్థం ఎక్కువ. అందువల్లే పాక్ విఫలం అవుతోంది" అని షోయబ్ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నానని, ఘోర వైఫల్యం దిశగా సాగుతున్నామని, ఇదంతా మిస్బా వంటి సారథి వల్లేనని అన్నారు. తక్షణం జట్టు కోచ్ వకార్ యూనిస్, చీఫ్ సెలక్టర్ మొయిన్ ఖాన్ లను తొలగించాలని, మొత్తం క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. కేవలం తన ప్రదర్శన, తన పరుగులు, బ్యాటింగ్ స్థానంపై మాత్రమే మిస్బా దృష్టి ఉంటుందని విమర్శించారు. అయితే, పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ మాత్రం జట్టును వెనకేసుకొచ్చాడు. తిరిగి పాకిస్థాన్ పుంజుకుంటుందని తెలిపారు.