: కలకాల జ్ఞానం తప్ప కాలజ్ఞానం తెలీదు: బ్రహ్మానందం
ఇప్పుడు చాలా మందికి కలకాల జ్ఞానం తప్ప కాలజ్ఞానం తెలీదని ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. విజయవాడలో జరిగిన తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, కలకాల జ్ఞానం అంటే ఎక్స్ పీరియన్స్ అని, కాలజ్ఞానం అంటే టైమ్ సెన్స్ అని అన్నారు. ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి తర్జుమా చేయమని అనడానికి కారణం ఏంటంటే మనలో విద్వత్తు కొరవడడమేనని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలోని జాషువా, శ్రీశ్రీ వంటి మహానుభావుల గురించి చెబితే రోమాలు నిక్కబొడుచుకుంటాయని అన్నారు. మన యువతకు మనభాషలోని సౌందర్యాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. తెలుగు భాష గురించి ఇప్పటి యువతకు చెబుతుంటే బాష అంత గొప్పదా? అంటూ ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషలో అద్భుతమైన రచనలు చేసిన మహానుభావులను బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. అంత అందమైన, సౌందర్యం నిండి ఉన్న భాషలో పుట్టిన మనమంతా తెలుగును మర్చిపోవడం ఎంత దౌర్భాగ్యమని ఆందోళన వ్యక్తం చేశారు.