: తనలోని తెలుగు లెక్చరర్ ని వెలికి తీసిన బ్రహ్మానందం
సినిమాల్లో నటుడిగా నిరూపించుకోకముందు బ్రహ్మానందం తెలుగు పాఠాలు బోధించే గురువు అని అందరికీ తెలిసిందే. విజయవాడలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనర్గళంగా ఉపన్యసించారు. తెలుగు భాషపై ఆయనకున్న మమకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు కవులు సిగిరెట్లు, మందు, స్టార్ హోటళ్లలో రూం లేకపోతే కవిత్వాన్ని రాయలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆముదం నూనె వేసిన దీపపు సమ్మె కింద, ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాధుడు, బమ్మెర పోతన, విశ్వనాధ సత్యనారాయణ వంటి మహానుభావులు తెలుగు నేలపై నడయాడారని ఆయన గుర్తు చేశారు. గతంలో కవులు తిట్టుకుంటే అందులో పాండిత్యం అద్భుతంగా ఉండేదని ఆయన చెప్పారు. మహానుభావుల విమర్శల్లోనూ విజ్ఞానం తొణికిసలాడేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషలో మహానుభావులు రాసిన శతకాల్లోని పలు పద్యాలను వల్లెవేశారు.