: సభను సజావుగా నడపడం అందరి బాధ్యత: మోదీ
పార్లమెంటులో ప్రధాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారపక్షం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, సభను సజావుగా సాగేలా చూడడం సమష్టి బాధ్యత అని అన్నారు. ఎన్నో అంచనాలు, ఆశలతో దేశం బడ్జెట్ సమావేశాలవైపు చూస్తోందని పేర్కొన్నారు. పార్టీలు లేవనెత్తే అంశాలపై సభలో చర్చిస్తామని ఆయన చెప్పారు. సభను సజావుగా నడిపేందుకు అంతా సహకరించాలని సూచించారు. కాగా, భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు నష్టం చేసేలా, పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూర్చేలా ఉన్న భూసేకరణ బిల్లుపై పార్లమెంటులో పోరాడతామని శపథం కూడా చేశాయి. ఈ నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.