: ఛీ...ఛీ... ఎంత దౌర్భాగ్యం... ఈ రోజు కూడా ఇంగ్లీషు పదాలు వాడాను: ఎన్టీఆర్
ఛీ...ఛీ ఎంత దౌర్భాగ్యం? మాతృ భాషా దినోత్సవం రోజు కూడా పూర్తి తెలుగులో మాట్లాడలేకపోయానని మాతృభాషపై అవ్యాజమైన ప్రేమను జూనియర్ ఎన్టీఆర్ కురిపించారు. హైదరాబాదులోని మాదాపూర్ లో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా తమకు సమాజంలో ఉండే అర్హత కల్పించింది అన్నారు. వసూళ్ల గురించి తానెప్పుడూ పట్టించుకోలేదు కానీ, అభిమానుల కళ్లలో ఆనందం చూస్తున్నానని అన్నారు. కధ రాయగలిగిన సత్తా ఉన్నప్పటికీ, తొలిసారి బయటి కథకు దర్శకత్వం చేయడమే తొలి విజయమని, పూరీ కంటే మరొకరు ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా మంచి వసూళ్లతో పాటు, మంచి సినిమాలు తీసే ధైర్యం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను బాగా నటించానని అంతా చెబుతున్నప్పటికీ, తన చుట్టూ ఉన్న వీరంతా తనను అద్భుతంగా నటించేలా చేశారని ఆయన తెలిపారు. ప్రకాశ్ రాజ్ తనలో స్పూర్తి రగిలించారని ఆయన చెప్పారు. 'అభిమానులు, పాత్రికేయులు ఈ సినిమా పట్ల చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు. కనీసం ఈ రోజు కూడా పూర్తి స్థాయి తెలుగు మాట్లాడలేని దౌర్భాగ్యపు స్థితిలో బతుకుతున్నా'మని ఆయన ఛీదరించుకున్నారు. దేశభాషలందు తెలుగులెస్స అన్నట్టుగా తెలుగు తనం చాటిచెప్పిన దైవం నందమూరి తారకరామారావుకు ధన్యవాదాలు అని అన్నారు. పాలలోని కమ్మదనం, తేనెలోని తీయదనం కలిపితేనే తెలుగుదనం అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మూవీ మొఘల్ కు శ్రధ్ధాంజలి ఘటించారు.