: విజయవాడలో ఆపరేషన్ నైట్ డామినేషన్ కు ప్రజల మద్దతుంది: పోలీస్ కమిషనర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ప్రవేశపెట్టిన ఆపరేషన్ నైట్ డామినేషన్ కు ప్రజలు మద్దతు తెలిపారని పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న ఆపరేషన్ నైట్ డామినేషన్ పై నగర ప్రజలతో ఫోన్ సర్వే చేపట్టామని అన్నారు. ఈ ఫోన్ కాల్స్ లో 82 శాతం మంది ఆపరేషన్ నైట్ డామినేషన్ కు మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. 18 శాతం మంది మాత్రమే దీనిని వ్యతిరేకించారని ఆయన వివరించారు. కాగా, నైట్ డామినేషన్ పేరిట నగర వాసులను ఇబ్బందులపాలు చేస్తున్నారని న్యాయవాది కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇదే ఆపరేషన్ లో ఓ వ్యక్తిని అకారణంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.