: ఆటో డ్రైవరుపై అనుమానంతో వెంబడించి యువతిని కాపాడిన కానిస్టేబుల్
తాను స్వయంగా ఆటో ఎక్కించి పంపిన యువతికి దారిలో ప్రమాదం జరగవచ్చని భావించిన ముంబై కానిస్టేబుల్ ఆ ఆటోను వెంబడించి ఆమెను కాపాడి అందరితో 'శభాష్' అనిపించుకొని కమిషనర్ దగ్గర నగదు రివార్డు పొందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే, రాత్రి 11:30 గంటల సమయంలో మేఘనా మురళి అనే ఒంటరి మహిళ బెంగళూరు నుంచి వచ్చి ముంబైలో దిగింది. కుర్లా ప్రాంతానికి వెళ్ళాలని ఆటో కోసం వేచి చూస్తుంటే సహర్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ చందనే గమనించాడు. ఒక ఆటోను ఆపి, ఆమెను ఎక్కించి పంపాడు. అయితే, ఆటో డ్రైవర్ పై ఏ మూలనో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ ఆటో వెనకే తన బైక్ పై అనుసరించాడు. కానిస్టేబుల్ అనుమానమే నిజమైంది. చీకటిగా ఉన్న చోట ఆటోను ఆపి అదనంగా డబ్బులు ఇవ్వాలని మేఘనను బెదిరించడం మొదలుపెట్టాడు. అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్, ఆటో డ్రైవరును హెచ్చరించి, అతని బండి కాగితాలు తీసుకున్నాడు. జరిగిన విషయాన్ని కంట్రోల్ రూంకు తెలిపి, ఆమెను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాలని డ్రైవరుకు గట్టిగా చెప్పి, ఆపై కూడా ఆటోను అనుసరిస్తూ వెళ్ళాడు. ఈ ఘటన అంతటినీ సదరు యువతి ముంబై కమిషనర్ కు ఇ-మెయిల్ ద్వారా తెలిపింది. ఆటో డ్రైవర్ వ్యవహారాన్ని, కానిస్టేబుల్ తనకు చేసిన సహాయాన్ని పూస గుచ్చినట్టు వివరించింది. దీంతో చురుకుగా వ్యవహరించిన కానిస్టేబుల్ కు రూ.2 వేల నగదు బహుమతిని కమిషనర్ అందించారు.