: బీజేపీ గేమ్ ప్లాన్ బహిర్గతమైంది: నితీశ్ కుమార్
బీహార్ లో బీజేపీ గేమ్ ప్లాన్ బహిర్గతమైందని జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ అన్నారు. మాంఝీ బలపరీక్ష, రాజీనామా అన్నీ ఆ పార్టీ ప్లాన్ లో భాగమేనని ఆరోపించారు. బలపరీక్షకు ముందే మాంఝీ రాజీనామా చేయడం, శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ కు సిఫారసు చేయడంతో బీహార్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నితీశ్, బీజేపీ రాజకీయాలను అడ్డుకునే దైర్యం తమకుందన్నారు. ఇలాంటి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనకు గవర్నర్ ముందు సానుకూలంగా స్పందించారని, ఆ తరువాత పరిణామాలు మారిపోయాయని చెప్పారు. గవర్నర్ పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్టు తమకు సమాచారం ఉందన్నారు. తదనంతర పరిణామాలపై ఇప్పుడే మాట్లాడలేనని నితీశ్ అన్నారు.