: సీబీఐ దర్యాప్తుతో నాశనమయ్యా... పరిహారం ఇప్పించండి: హైకోర్టులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేేసులో ఇరుక్కున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. అకారణంగా తనను కేసులో ఇరికించిన సీబీఐ తన జీవితాన్ని, స్వేచ్ఛను నాశనం చేసిందని ఆ పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తు అన్యాయం, అక్రమం, ఏకపక్షమని ఆమె ఆరోపించారు. కేసు కారణంగా జీవతాన్ని కోల్పోయిన తనకు సీబీఐ నుంచి పరిహారం ఇప్పించడమే కాక కేసు నుంచి తనను తప్పించాలని కూడా ఆమె కోర్టును కోరారు. కేసుతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నీ వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేసులో అరెస్ట్ తో పాటు కోర్టుకు హాజరు నుంచి తనను మినహాయించాలని కూడా ఆమె కోర్టును అభ్యర్థించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సీబీఐ ఎస్పీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆమె తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.