: చిత్తూరు జిల్లా పోలీసుల క్రూరత్వం... ధర్డ్ డిగ్రీలో నిందితుడి కిడ్నీలు ఫెయిల్: సీఐ సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలో పోలీసుల క్రూరత్వం మరోమారు బయటపడింది. అత్యాచారం కేసులో నిందితుడిగా భావిస్తున్న షేక్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి నరకం చూపారు. పది రోజుల పాటు అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అతడికి థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో రుచి చూపారు. దీంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తీరా అతడిని పరిశీలించిన వైద్యులు, పోలీసుల థర్డ్ డిగ్రీ కారణంగా నిందితుడి కిడ్నీలు రెండూ ఫెయిలయ్యాయని నిర్ధారించారు. ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్ లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రికి చేరిన నిందితుడు తనపై పోలీసులు జరిపిన చిత్రహింసలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ప్రాథమిక దర్యాప్తులో నిందితుడి వాదన నిజమని తేలడంతో సీఐ వేణుగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. విచారణ పూర్తైన తర్వాత ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రకటించారు.