: ప్రత్యేక హైకోర్టు కోసమూ పార్లమెంట్ ను స్తంభింపజేస్తాం: నిజామాబాదు ఎంపీ కవిత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటును అతలాకుతలం చేసిన తాము, ప్రత్యేక హైకోర్టు కోసమూ దానిని స్తంభింపజేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును డిమాండ్ చేస్తూ నిజామాబాదులో కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షా శిబిరాన్ని నిన్న ఆమె సందర్శించి, మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగానే ప్రత్యేక హైకోర్టునూ సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్లమెంట్ ను స్తంభింపజేసేందుకు కూడా వెనుకాడబోమని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన న్యాయవాదుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము ముందుండి పోరాడతామని ఆమె పేర్కొన్నారు.