: ఆ కోతి ఇక కోటీశ్వరురాలే!
విదేశాల్లో పెంపుడు జంతువులకు కోట్ల ఆస్తిని ధారాదత్తం చేయడం చదువుకున్నాం. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి వింత చోటుచేసుకోనుంది. భారతీయులకు అనాదిగా పెంపుడు జంతువులతో ఎనలేని అనుబంధం వుంది. ఆవులు, గొర్రెలు, కుక్కలు, కోతులను పెంచుకోవడం సర్వసాధారణం. రాయ్ బరేలీలోని న్యాయవాది సబిష్ట (45) భర్త చిరు వ్యాపారి. ఈ దంపతులకు పిల్లలు లేరు. 2004లో వీరికి ఓ కోతి తారసపడింది. అది చేరువ కావడంతో దానిని తెచ్చుకుని 'చున్ మున్' అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. సుదీర్ఘ ప్రయాణంలో అది వారి ప్రాణానికి ప్రాణంగా మారింది. దీంతో తమ తరువాత దాని ఆలనాపాలనా చూసేవారు లేరని భావించిన ఆ దంపతులు తమ ఆస్తి పాస్తులను దాని పేరిట రాసేయాలని భావించారు. దీంతో 200 చదరపు గజాల ఇల్లు సహా, లక్షలాది రూపాయలను దాని పేరిట రాస్తున్నామన్నారు. అది వచ్చిన నాటి నుంచి తమకు అంతా మంచే జరిగిందని చెబుతున్న ఆ దంపతులు, 'చున్ మున్'కు చైనీస్ ఫుడ్ బాగా ఇష్టమనీ, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలను మక్కువగా తాగుతుందని తెలిపారు.