: అబ్బే.. డైరెక్ట్ ఫైట్ మా వల్ల కాదు... సేఫ్ ఎంట్రీ ఇవ్వండి: ఎమ్మెల్సీ బరికి తుమ్మల, కడియం నిరాసక్తత?
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్ష ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారట. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య బర్తరఫ్ తర్వాత అనూహ్యంగా ఆ పదవి దక్కించుకున్న కడియంతో పాటు, ఇటీవలే టీఆర్ఎస్ లో చేరి రోడ్లు, భవనాల శాఖను చేజక్కించుకున్న తుమ్మలకు కూడా అటు అసెంబ్లీలో కాని ఇటు మండలిలో కాని సభ్యత్వం లేదు. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా వారు ఏదో ఒక సభలో కాలు మోపక తప్పదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం టీఆర్ఎస్ టికెట్ పై గెలవగా, తుమ్మల టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని వారిద్దరూ చేతులెత్తేశారట. సేఫ్ ఎంట్రీగా పరిగణిస్తున్న ఎమ్మెల్యే కోటాలో అవకాశానికే ప్రాధాన్యమిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఓ స్థానం నుంచి టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాదరావును ఎంపిక చేయగా, మరొకరి కోసం కేసీఆర్ గాలిస్తున్నారట. ఇదిలా ఉంటే, ప్రత్యక్ష పోరుకు ఆసక్తి చూపని కడియం, తుమ్మల... ఇద్దరూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రులుగా వ్యవహరించారు.