: బకాయిదారుల ఇళ్ల ముందు హిజ్రాల గానా భజానా: చెన్నై కార్పోరేషన్ వినూత్న చర్య
మొండి బకాయిల వసూళ్ల కోసం ఆంధ్రా బ్యాంకు ఇటీవల చేపట్టిన వినూత్న నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రుణాల వసూళ్ల కోసం బకాయిదారుల ఇళ్ల ముందు బ్యాంకు సిబ్బంది ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. దీని ద్వారా బ్యాంకుకు బకాయిలు వసూలు కాగా, ఇదే విధానాన్ని మరో బ్యాంకు కూడా అనుసరించింది. మొన్నటికి మొన్న హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టి కొంతమేర వసూళ్లు సాధించారు. ఇదే కోవలో చెన్నై మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. బకాయిదారుల ఇళ్ల ముందు హిజ్రాలతో గానా భజానా పెట్టిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన బకాయిదారులు పన్నులను చెల్లించేందుకు మునిసిపల్ కార్యాలయం ముందు క్యూ కడుతున్నారట. దీంతో చెన్నై మునిసిపల్ అధికారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. చెన్నై అధికారుల వినూత్న చర్యను మనమూ అమలు చేస్తే ఎలా ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచన చేస్తున్నారట. అంటే, హైదరాబాదీ పన్ను బకాయిదారుల ఇళ్లు, కార్యాలయాల ముందు హిజ్రాల గానా భజానాకు త్వరలో తెర లేవనుందన్న మాట.