: చైనాకు పోటీగా రూ.50 వేల కోట్లతో యుద్ధనౌకలు
సముద్ర జలాల్లో చైనాకు దీటుగా యుద్ధనౌకలను సమకూర్చుకోవాలని భావిస్తున్న ఇండియా ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ఇప్పటివరకూ భారత అమ్ములపొదిలో లేని అత్యాధునిక యుద్ధనౌకల కోసం 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన ప్రణాళికకు మోదీ సర్కారు ఆమోదం తెలిపింది. హిందూ మహా సముద్రంలో చైనా నౌకాదళంతో పోటీ పడాలంటే ఆధునిక జలాంతర్గాముల అవసరం ఎంతైనా ఉందని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో చైనా, పాకిస్తాన్ లతో ఒకేసారి పోరుకు దిగాల్సి వస్తే, భారత సామర్థ్యం చాలదని రక్షణ వర్గాలు హెచ్చరించాయట. దీనికితోడు కొంతకాలంగా చైనా జలాంతర్గాములు శ్రీలంక నౌకాశ్రయాల్లో తిష్ట వేయడంతో భారత భయాలు మరింతగా పెరిగాయి. దీంతో, మంత్రివర్గ సహచరులతో భేటీ అయిన మోదీ, రాడార్లకు సులువుగా దొరకని విధంగా ఉండేలా, శత్రు సైన్యంపై భారీఎత్తున విరుచుకుపడేలా ఉండే 7 నౌకలను సిద్ధం చేయాలని సూచించారు. అణు బాంబులు ప్రయోగించే సత్తా ఉండే ఆరు జలాంతర్గాములను కూడా సమకూర్చాలని ఆదేశించినట్టు సమాచారం. వీటిని ముంబై, కోల్ కతా లలోని దేశవాళీ షిప్ యార్డుల్లో 'ప్రాజెక్ట్ 17-ఎ' పేరిట తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో వీటి నిర్మాణం మొదలవుతుందని అంచనా.