: ఈ స్టంప్స్ చాలా ఖరీదువి... అందుకే ధోనీ ఆనందానికి అంపైర్ అడ్డుతగిలాడు!
నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలిచిన రోజున, ఆ ఆనందంలో పిచ్ పై స్టంప్స్ తీసుకువెళ్లేందుకు ధోనీ ప్రయత్నించగా, ఎంపైర్లు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్టంప్స్ తీసుకోనివ్వక పోవడంతో, ధోనీ నిరాశ చెందాడని వార్తలు కూడా వచ్చాయి. దీనికి అసలు కారణం ఏమంటే, ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్ కాబట్టి. వీటి ఖరీదు రూ.24 లక్షలట. ఇక బెయిల్స్ ధర సుమారు రూ.50 వేలని తెలుస్తోంది. అందువల్లే, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్ ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు. స్టంప్స్ తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది. కాగా, స్టంప్స్ సున్నితంగా ఉండటంతో, బ్యాట్ హేండిల్ తో కొట్టడం కూడా కుదరదు. బంతి స్టంప్స్ కు తగిలినప్పుడు వీటిలోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. వీటిని జాగ్రత్తగా వాడాల్సి ఉందని, లసిత్ మలింగ యార్కర్లకు ఇవి విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడట.