: ఢిల్లీలో ‘సామాన్య’ పాలన ప్రారంభం... జనతా దర్బార్ లో జనం సమస్యలు విన్న కేజ్రీవాల్
ఢిల్లీలో ఆప్ నేతృత్వంలో అరవింద్ కేజ్రీవాల్ తనదైన ‘సామాన్య’ పాలనను ప్రారంభించారు. ఈ నెల 14న ఢిల్లీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన కేజ్రీవాల్, నిన్న ఘజియాబాదులోని పార్టీ కార్యాలయం కౌశాంబిలో జనతా దర్బార్ నిర్వహించారు. గతంలోనూ సీఎం హోదాలో ఆయన నిర్వహించిన జనతా దర్బార్లు రద్దీతో రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిన్నటి దర్బార్ లో ఆప్ కార్యకర్తలు కొందరు జనాన్ని నియంత్రించారు. కార్యాలయంలోని కేజ్రీవాల్ ను కలిసేందుకు నలుగురు, ఐదుగురిని అనుమతిస్తూ ఎలాంటి రసాభాస చోటుచేసుకోకుండా జాగ్రత్త తీసుకున్నారు. నిన్నటి దర్బార్ కు దాదాపుగా 200 మంది ప్రజలు వచ్చారు. ఇకపై ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో జనతా దర్బార్లను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాక అధికార నివాసంలోకి కేజ్రీవాల్ మారేదాకా పార్టీ కార్యాలయంలోనే దర్బార్లను నిర్వహిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి.