: అక్రమ సంబంధం అన్ని సందర్భాల్లో క్రూరత్వం కాదు... సుప్రీంకోర్టు వ్యాఖ్య
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదని కోర్టు అభిప్రాయపడింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తుంటే, అతడి భార్యను ఆత్మహత్యకు పురిగొల్పినట్టేనన్న వాదనతో న్యాయమూర్తులు విభేదించారు. గుజరాత్ కు చెందిన ఓ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్న అనంతరం, భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. దీంతో ట్రయల్ కోర్టు, హైకోర్టు నిందితుడిని దోషిగా తేల్చాయి. కేసును జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. ఈ కేసులో వరకట్న వేధింపులు లేవని, నిందితుడికి అక్రమ సంబంధమున్నట్టు సరైన ఆధారాలు చూపలేకపోయారని బెంచ్ పేర్కొంది. ఇలాంటి సందర్భం సెక్షన్ 498 (ఎ) కింద 'క్రూరత్వం' కిందకు వస్తుందా? అని ప్రశ్నించింది. అక్రమ సంబంధం చట్టవ్యతిరేకం, అనైతికమైనప్పటికీ అన్ని సందర్భాల్లో, దాన్ని క్రూరత్వం కింద పరిగణించలేమని స్పష్టం చేసింది.