: కేజ్రీవాల్ కు అధికారుల సలహాలు...నీటి, విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కార్యక్రమాలు అమలు చేసేందుకు అధికారులు సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మంచి నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు 50 శాతం తగ్గే అవకాశం ఉందని, వచ్చే వారం ఈ మేరకు కేజ్రీవాల్ ప్రకటన జారీ చేయవచ్చని సమాచారం. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి పదవి చేపట్టిన తరువాత తొలిసారి ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆయన ప్రజాదర్బార్ ఏర్పాటు చేసినప్పటికీ రాజీనామాతో అది అర్థాంతరంగా ఆగిపోయింది. పూర్తిస్థాయి అధికారం చేపట్టడంతో సమస్యలు నేరుగా చెప్పుకోండంటూ ఆయన ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఆయన ఘజియాబాద్ లోని కౌశాంబిలోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 200 మందిని ఆహ్వానించి నలుగురు చొప్పున లోపలకు పిలిచి, వారి సమస్యలు విన్నారు. ఇకపై ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.