: ఆ సినిమా తర్వాత రామానాయుడు వెనక్కితిరిగి చూసుకోలేదు!
ఎక్కడో కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి మద్రాసు చేరి దిగ్గజ నిర్మాతగా పేరు సంపాదించడం మామూలు విషయం కాదు. కానీ, పట్టుదలకు క్రమశిక్షణ తోడైతే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు రామానాయుడు. 1963లో తొలి సినిమా 'అనురాగం' ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. జగ్గయ్య, భానుమతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రం నష్టాలను మిగిల్చింది. అయినా, వెనుకంజ వేయకుండా రెట్టించిన పట్టుదలతో శ్రమించారు. ఆ తర్వాత, 1965లో సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్టీఆర్ తో 'రాముడు-భీముడు' నిర్మించారు. తాపీచాణక్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రామానాయుడు ఇక వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. అయితే, డబ్బును వృథా చేయనని తండ్రికిచ్చిన మాటను మాత్రం ఆయన ఎన్నడూ మరువలేదు. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించి శతాధిక చిత్రాల నిర్మాతగా ఖ్యాతిగాంచారు. జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు... ఇలా ఎన్నో పురస్కారాలు రామానాయుడిని వెతుక్కుంటూ వచ్చాయి.