: రామానాయుడు మృతి జీర్ణించుకోలేని నిజం: చిరంజీవి
మూవీ మొఘల్ రామానాయుడు మృతి జీర్ణించుకోలేని నిజమని సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. ఆయన పార్తివ దేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రామానాయుడు గారు తనను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదన్నారు. కలిసిన ప్రతిసారీ రాజా అంటూ ఆప్యాయత చూపించేవారని గుర్తు చేసుకున్నారు. రామానాయుడు గారికి సినిమానే ఊపిరి అని ఆయన చెప్పారు. సినిమాయే లోకంగా ఆయన జీవించారని చెప్పారు. సినిమాలు తీయడం మానేయాలని నాన్నగారికి చెప్పమని సురేష్ తనను కోరగా, తాను కూడా రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించానని ఆయన తెలిపారు. అయితే అప్పుడు ఆయన మాట్లాడుతూ, రాజా నేను సినిమాలు తీయడం మానేస్తే నా జీవం ఆగిపోయినట్టేనని అన్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయనకు సినిమాయే జీవితం అని, కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే అలాంటి వ్యక్తి ఉన్నారని ఆయన అన్నారు. అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన రామానాయుడుగారు లేకపోవడం ఆయన కుటుంబానికే కాదు, నా లాంటి ఆప్తులకు కూడా తీరని లోటని ఆయన పేర్కొన్నారు.