: గాంధీ, మండేలా తర్వాత ఒకే ఒక్కడు... కేసీఆర్!: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ తన జన్మదినం సందర్భంగా పలు అరుదైన పోలికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూతురు కవిత తనను స్టార్ బ్యాట్స్ మన్ గా పోల్చిన కొద్దిసేపటికే, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆయనకు మరో కొత్త పోలికను ఆపాదించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదాను సాధించేందుకు కేసీఆర్ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష నిర్మూలన కోసం నెల్సన్ మండేలాలు అహింసా మార్గాన్ని ఎంచుకుని విజయం సాధించారన్న జగదీశ్ రెడ్డి, వారి తర్వాత నిర్దేశిత లక్ష్యాన్ని ఆ మార్గంలో సాధించిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. గాంధీ, మండేలాల తర్వాత అహింసా మార్గంలో ఏ ఒక్కరూ విజయం సాధించలేదన్నారు. ఆ ఇద్దరి తర్వాత అహింసా మార్గంలో విజయం సాధించిన ఒకే ఒక్కడు కేసీఆరేనని జగదీశ్ రెడ్డి తెలిపారు.