: సియాటిల్ లో హిందూ ఆలయ గోడపై ‘గెటవుట్’ రాతలు... దర్యాప్తునకు అమెరికా ఆదేశం
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో అతిపెద్ద హిందూ దేవాలయం వద్ద నిన్న కలకలం రేగింది. సియాటిల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం గోడపై గుర్తు తెలియని దుండగులు ‘గెటవుట్’ అనే పదాలను రాశారు. దీంతో, అక్కడి హిందువుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న బోథెల్ సిటీ పోలీసు ఉన్నతాధికారులు ఆలయాన్ని సందర్శించి అక్కడి రాతలను పరిశీలించారు. అనంతరం దీనిపై విచారణ మొదలుపెట్టారు. 'ద హిందూ అమెరికన్ ఫౌండేషన్' ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది. మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయనగా, ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ‘‘ఇలాంటి ఘటన అమెరికాలో గతంలో ఎప్పుడూ జరగలేదు. అసలు మీరెవరు మమ్మల్ని గెటవుట్ అనడానికి? ఈ దేశం వలసవాదులదే’’ అని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నిత్యా నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బోథెల్ పోలీసులు వేగంగా స్పందించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల క్రితం వెలసిన ఈ ఆలయం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. రెండో దశ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి.