: 'లింగా' నష్టాలకు రజనీ బాధ్యుడెలా అవుతారు?: నిర్మాతల మండలి
'లింగా' చిత్రం ద్వారా భారీగా నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి ఎదుట భిక్షాటన చేపట్టడాన్ని తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తప్పుబట్టింది. ఆ సినిమా నష్టాలకు రజనీకాంత్ ఎలా బాధ్యత వహిస్తారని మండలి ప్రశ్నించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. "రజనీ గారి చిత్రాలు ఎల్లప్పుడూ అత్యధిక సక్సెస్ రేట్ నమోదు చేస్తాయి. ఆయనతో పనిచేసిన వారికి సాధారణంగా బాగానే గిట్టుబాటు అవుతుంది. కానీ, 'లింగా' నష్టాలను ఆయన భరించాలనడం అనైతికం. డిస్ట్రిబ్యూటర్ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రజనీకాంత్ జన్మదినం పురస్కరించకుని గతేడాది డిసెంబర్ 12న విడుదల చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. 'లింగా'లో రజనీ సరసన సోనాక్షీ సిన్హా, అనుష్క నటించారు. కాగా, నష్టంలో 10 శాతం చెల్లించేందుకు చిత్ర నిర్మాత 'రాక్ లైన్' వెంకటేశ్ ముందుకురాగా అందుకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించలేదు. వారు రజనీ ఇంటి ఎదుట భిక్షాటన చేయాలని నిర్ణయించుకుని కార్యాచరణకు దిగారు.