: రూ.425 కోట్లకు లెక్కెక్కడ? ఫెమా చట్టం కింద బీసీసీఐ, ఐపీఎల్ అధికారులకు ఈడీ నోటీసులు
2009లో క్రికెట్ పోటీల ప్రసార హక్కులను కట్టబెట్టే విషయంలో విదేశీ మారక చట్టాల ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బీసీసీఐ, ఐపీఎల్, ప్రైవేటు మల్టీమీడియా కంపెనీల అధికారులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం రూ.425 కోట్లకు లెక్కలు చెప్పాలని తెలిపింది. ఈడీ నోటీసులు జారీచేసిన వారిలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, సీఓఓ సుందర రామన్ లతో పాటు, వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్, మల్టీ స్క్రీన్ మీడియాల అధికారులు ఉన్నారు. చట్టవిరుద్ధంగా చెల్లింపులు చేసేందుకు వీరు కాంట్రాక్టు దస్త్రాలను మార్చారని ఆరోపించింది. బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతున్న రోజే ఈ నోటీసులు జారీ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ కేసును ఈడీ 2009లో నమోదు చేసింది. 2008లో 918 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.5,600 కోట్లు) ఐపీఎల్ ప్రసార హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ కు బీసీసీఐ విక్రయించగా, ఆ తరువాతి సంవత్సరంలో వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9,943 కోట్లు) మొత్తం హక్కులను సోనీ బ్రాండ్ యాజమాన్య సంస్థ మల్టీ స్క్రీన్ మీడియాకు బదిలీ చేసింది. ఈ ఒప్పందాల్లో ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ గుర్తించి ఈ నోటీసులు జారీ చేసింది.