: విశ్వాస పరీక్ష జరిగేదాకా పదవి నుంచి దిగేదిలేదు... తేల్చిచెప్పిన బీహార్ సీఎం
బీహార్ అసెంబ్లీలో బల నిరూపణ జరిగేదాకా తాను పదవి నుంచి తప్పుకునేది లేదని సీఎం జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను నితీశ్ కుమార్ ఢిల్లీ పిలిపించి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను ముఖ్యమంత్రిగా చేసి నితీశ్ కుమార్ తప్పు చేశారని, తానెప్పుడైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టానో, అప్పటి నుంచి తాను ముప్పుగా పరిణమించానని భావించడం మొదలుపెట్టారని మాంఝీ పేర్కొన్నారు. జేడీ(యూ) నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మాంఝీ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశాలున్నాయి. కాగా, నితీశ్ కుమార్ తనకు మద్దతిస్తున్న 130 మంది శాసనసభ్యులతో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని కలవడం తెలిసిందే. అటు, సీఎం మాంఝీ ఫిబ్రవరి 20న అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ బీహార్ గవర్నర్ ఆదేశించారు.