: చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్


హైదరాబాదు, ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్ ప్రాంతానికి తరలించి, అక్కడ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాలనకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండాలన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి కూడా విదితమే. దీనిపై పలు పార్టీలు, వ్యక్తులు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ క్రమంలో, చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రాంతంలో చారిత్రక కట్టడాలున్నాయని, కొత్త నిర్మాణాలు చేపట్టరాదంటూ ప్రభాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు... పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పిటిషనర్ ను ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News