: సాగర్ వివాదంలో చొరవ చూపింది చంద్రబాబే: ముద్దుకృష్ణమనాయుడు


నీటి విడుదల విషయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తలెత్తిన వివాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిన చొరవ కారణంగానే సమసిపోయిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ వద్ద ప్రజలు, పోలీసులు, ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న సమయంలో, వెంటనే చర్యలు తీసుకోవాలని బాబు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారని తెలిపారు. సంయమనం పాటించాల్సిందిగా ఏపీ పోలీసులకు తాను చెబుతానని, తెలంగాణ పోలీసులకు మీరు చెప్పాలని బాబు కేసీఆర్ కు సూచించారని వెల్లడించారు. దీనిపై బాబును తాము అభినందిస్తున్నామని ముద్దుకృష్ణమ అన్నారు. వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు సరికావని హితవు పలికారు. సాగర్ వివాదంలో నామినేటెడ్ పదవిలో ఉన్న గవర్నర్ ను టీడీపీ నేతలు కలవడం ఏమిటని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మైసూరా వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. విభజన చట్టంలో గవర్నర్ కు విశేష అధికారాలు కట్టబెట్టినందునే గవర్నర్ ను కలవడం జరిగిందని ముద్దుకృష్ణమ స్పష్టం చేశారు. అసలు, రాష్ట్ర విభజనకు వైఎస్సారే కారణమని దుయ్యబట్టారు. హైదరాబాదును అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపింది చంద్రబాబేనని కొనియాడారు. అసలు తెలంగాణకు మేలు చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు తప్ప మరెవరూ కాదన్నారు. హైదరాబాదులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, మెట్రోరైలు, అవుటర్ రింగు రోడ్డు, ఐఎస్ బీ తదితర ప్రాజెక్టులు సాకారం అయ్యేందుకు చంద్రబాబే కారణమని ఉద్ఘాటించారు. సైబర్ సిటీ పేరిట ఐటీ పరిశ్రమలను హైదరాబాద్ తీసుకువచ్చింది బాబేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News