: ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదని ముందే చెప్పా: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అంత సులభం కాదని తాను ముందే చెప్పానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ప్రధాని మోదీకి సంబంధం లేదని ఆయన అన్నారు. నేడు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తమకు సవాల్ విసిరాయని అన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దానిని సవాల్ గా స్వీకరించి ముందడుగు వేస్తామని చెప్పారు. దేశంలో పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నాగార్జున సాగర్ జలాల సమస్యను ఇద్దరు సీఎంలు కలసి పరిష్కరించుకోవడం శుభపరిణామం అని ఆయన అన్నారు.