: చెట్టుపై మూడు రోజులుగా ముగ్గురు మహిళల ఆందోళన... డెహ్రాడూన్ లో వినూత్న నిరసన
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం సెల్ టవర్లను ఎక్కిన ఉద్యమకారులను చూశాం. అలాంటి సందర్భంలో ఉద్యమకారులను పోలీసులు, రాజకీయ నేతలు గంటల వ్యవధిలోనే కిందకు తీసుకొచ్చిన సంఘటనలూ మనకు తెలుసు. కాని ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ మహిళలు వినూత్న నిరసనకు దిగి యావత్తు దేశాన్నే నివ్వెరపరిచారు. కలెక్టర్ కార్యాలయంలోని చెట్టు ఎక్కిన ముగ్గురు మహిళలు తమ డిమాండ్ల సాధన కోసం మూడు రోజులుగా చెట్టుపైనే నిరసనను కొనసాగించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారికి ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు, వృద్ధాప్య పింఛన్లను డిమాండ్ చేస్తూ డెహ్రాడూన్ కు చెందిన భూమా రావత్, సావిత్రి నేగి, భువనేశ్వరి నేగి అనే మహిళలు చెట్టెక్కారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అక్కడికి వచ్చి, మీ డిమాండ్లను నెరవేరుస్తాం, కిందకు దిగండని కోరినా వారు వినలేదు. అధికారిక ఉత్తర్వులు వెలువడితే కాని ఆందోళనను విరమించేది లేదని ఆ మహిళలు తేల్చిచెప్పారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం హరీశ్ రావత్ వారితో మాట్లాడటంతో చెట్టు దిగి తమ ఆందోళనను విరమించారు.