: సాగర్ జల వివాదానికి కేంద్రం నిర్లక్ష్య వైఖరే కారణం: టీపీసీసీ చీఫ్ పొన్నాల
తెలుగు రాష్ట్రాల మధ్య సాగర్ జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఏపీ, తెలంగాణల మధ్య సాగర్ జల వివాదం తీవ్రమవుతున్నా, నరేంద్ర మోదీ సర్కారు చోద్యం చూస్తోందే తప్పించి, సమస్య పరిష్కారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. సాగర్ జల వివాదాన్ని మీరే పరిష్కరించుకోండి అంటూ కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం తెలంగాణకు విద్యుత్ దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పొన్నాల కోరారు.