: నేనలా అనలేదు... మహిళా జర్నలిస్టులు అపార్థం చేసుకున్నారు: కేంద్ర మంత్రి రాథోడ్ వివరణ
మహిళలు రిపోర్టింగ్ వదిలేసి వార్తా విశ్లేషణలకు పరిమితం కావాలని తాను అనలేదని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మహిళా జర్నలిస్టులు అపార్థం చేసుకున్నారని ఈ ఉదయం ట్వీట్ చేశారు. తన భార్య ఒక మాజీ సైనికురాలు అని గుర్తుచేసిన ఆయన మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు తీసిపోరని అన్నారు. కాగా, నిన్న మహిళా విలేకరులతో సమావేశం అయినప్పుడు "మీరు రిపోర్టింగ్ కోసం బయటకు వెళ్ళకుండా మీ సేవలు అందించవచ్చు. అంతమాత్రాన మీరు బయటకు వెళ్ళవద్దని కాదు. అంతకుమించి తల్లిగా, చెల్లిగా, భార్యగా బాధ్యతలను నెరవేర్చాల్సిన మీరు, సెక్యూరిటీ, పని గంటలు, రక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకుని, వార్తా విశ్లేషణ వంటి పనులకు పరిమితం కావాలి" అని అన్నారు. రాథోడ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన వివరణ ఇచ్చుకున్నారు.