: నేడు సామాన్యుడికి పట్టాభిషేకం... ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీ రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రామ్ లీలా మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సన్నిహితుడు మనీశ్ సిసోడియా, మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, ఆసిమ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు వివరించాయి. తన ప్రమాణానికి రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఇప్పటికే రేడియో ద్వారా ఆహ్వానించారు. పలువురు వీఐపీలు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావచ్చని భావిస్తున్న నేపథ్యంలో సుమారు 1200 మందితో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.