: ఆ ముగ్గురు మహిళలతో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడింది!
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ముగ్గురు మహిళలతో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఎందుకంటే, ఆ ముగ్గురు మహిళలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చిప్కో ఉద్యమం తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు. పోలీసులు బతిమాలినా, ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారు వినడం లేదు, పట్టువిడవడం లేదు, కిందకు దిగి రావడం లేదు. పోనీ బలప్రయోగం చేసి వారిని దించుదామంటే, వారు ఎక్కిన చెట్టు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలో ఉంది. దీంతో, ఏం చేయాలో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని, 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భూమా రావత్, సావిత్రి నేగి, భువనేశ్వరి నేగి డెహ్రాడూన్ కలెక్టర్ కార్యాలయంలోని ఓ చెట్టెక్కి కూర్చున్నారు. మూడు రోజులుగా వారు అలాగే కూర్చోవడంతో కలెక్టర్ రంగంలోకి దిగి, వారి డిమాండ్లకు అంగీకరిస్తున్నామని చెప్పారు. అయినా పట్టువీడని ముగ్గురు మహిళలు, ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడితే తప్ప తాము దిగేది లేదని స్పష్టం చేశారు. దీంతో, అధికారులు వారికి మంచినీళ్లు, తాళ్లు అందించారు. నిద్ర మత్తులో చెట్టు మీద నుంచి కిందికి జారి పడకుండా చెట్టుకి కట్టేసుకోవాలని మహిళలకు సూచించారు.