: పెళ్లి చూపులకు పిలవలేదని ఒకరి ఆత్మహత్య, ప్రియురాలి తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరి ఆత్మహత్యాయత్నం...
చిన్నచిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకొని కన్నవారికి పెను విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. నేడు అనంతపురం జిల్లాలో... తమ్ముడి పెళ్లి చూపులకు తనను పిలవలేదని మనస్తాపం చెందిన రవి (28) అనే వ్యక్తి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన గుమ్మఘట్ట మండలం కె.పి.దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. మరో ఘటనలో, తమ ప్రేమను పెద్దలు నిరాకరించినందుకు మనస్తాపం చెంది గుంతకల్లుకు చెందిన రాజు (19) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన క్లాస్ మేట్ ను రెండేళ్లుగా ప్రేమిస్తున్న రాజును ఈ ఉదయం యువతి తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. నిద్రమాత్రలు మింగిన రాజును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.