: జైలు నుంచి జాకీచాన్ కుమారుడు విడుదల
ప్రముఖ నటుడు జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ జైలు నుంచి ఈరోజు విడుదలయ్యాడు. డ్రగ్స్ కేసులో విధించిన ఆరు నెలల జైలు శిక్ష ముగియడంతో ఉదయం అతను విడుదలై వెళ్లిపోయినట్టు జిన్హువా వార్తా ఏజెన్సీ తెలిపింది. ఈ కేసులో గతేడాది ఆగస్టులో కొన్ని రోజులు రిమాండ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో మిగతా శిక్ష అనుభవించడంతో చాన్ ను రిలీజ్ చేశారు. నటుడు, గాయకుడైన 32 ఏళ్ల చాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడం, అంతేగాక, అతని నివాసంలో 100 గ్రాముల డ్రగ్స్ పోలీసులు కనుగొనడంతో గతేడాది డిసెంబర్ లో అభియోగాలు నమోదయ్యాయి. దాంతో, స్థానిక న్యాయస్థానం శిక్ష విధించింది. ఇదిలా ఉంటే, రేపు చాన్ బీజింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.