: చంద్రబాబు వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు: వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ దుశ్చర్య


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన నిన్న వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిన్నటి చంద్రబాబు వరంగల్ పర్యటనను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు యత్నించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళితే... ‘వస్తున్నా... మీ కోసం’ పాదయాత్ర వంద రోజులు పూర్తైన నేపథ్యంలో వరంగల్ జిల్లా మహ్మదాపురం పరిధిలోని మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద టీడీపీ నేతలు పెద్ద పైలాన్ ను ఆవిష్కరించారు. దానికి సమీపంలోనే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. పైలాన్, విగ్రహావిష్కరణ సందర్భంగా నాడు మాట్లాడిన చంద్రబాబు, ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రకటన చేశారు. అనంతర కాలంలో రాష్ట్ర విభజన, ఏపీలో వర్గీకరణకు ప్రభుత్వం నిరాసక్తత నేపథ్యంలో చంద్రబాబు వైఖరిపై ఎమ్మార్పీఎస్ విమర్శలు కొనసాగిస్తోంది. నిన్న చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనను అడ్డుకునే క్రమంలో పలు ఆందోళనలను చేపట్టింది. అందులో భాగంగా మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్దనున్న టీడీపీ పైలాన్ ను నిరసనకారులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అక్కడికి సమీపంలోనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీనిని గమనించిన స్థానికులు వెనువెంటనే విగ్రహానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. అప్పటికే విగ్రహం వెనుక భాగం కాలిపోయింది.

  • Loading...

More Telugu News