: తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం... బరిలో 13 మంది అభ్యర్థులు


తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో భాగంగా కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ నేత వెంకటరమణ అకాల మరణం నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. టీడీపీ తరఫున వెంకటరమణ సతీమణి సుగుణ బరిలోకి దిగగా, కాంగ్రెస్ పార్టీ శ్రీదేవిని రంగంలోకి దింపింది. సిట్టింగ్ సభ్యుడు మృతి చెందిన సందర్భంలో సదరు కుటుంబానికి చెందిన వారు పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపరాదన్న సంప్రదాయానికి కట్టుబడి వైసీపీ ఈ పోటికి దూరంగా ఉంది. అయితే సదరు సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన కాంగ్రెస్ చివరి నిమిషంలో అభ్యర్థిని బరిలోకి దించడంతో పాటు పోటీని విరమించుకోవాలన్న టీడీపీ అభ్యర్థనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలబెట్టగా, లోక్ సత్తా కూడా తన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇక స్వతంత్రులు కూడా నామినేషన్లు వేశారు. మొత్తం 13 మంది అభ్యర్థులు తిరుపతి అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. నేటి పోలింగ్ కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • Loading...

More Telugu News