: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 9 నెలలుగా ఖాళీగా వున్నాను!: జేసీ
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికైన 9 నెలలు పని చేయకుండా ఖాళీగా ఉన్న కాలం ఇదేనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కేవలం ఇద్దరే మంత్రులు ఉన్నారని అన్నారు. ఒకరు మోదీ అయితే, రెండో వ్యక్తి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది సోనియా గాంధీ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఎన్నుకొన్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానన్న ఆవేదనే తనను ఇలా మాట్లాడేలా చేస్తోందని ఆయన చెప్పారు. ఎంపీలను కరివేపాకులా వాడుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 'కేజ్రీవాల్ కాదు కదా, ఆయన బాబు కూడా అవినీతిని ఆపలేడు. అయితే ఆయన ఏం చేయాలో చూపించాడు. ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాలని, రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంచడం దారుణమని' ఆయన పేర్కొన్నారు. అంతా కోనసీమ అంటారు, కానీ కోనసీమలో ఏముంది? అనంతపురం రైతులకు నీరిచ్చి చూడండి, ఎవరి ప్రాంతం ఏంటో తేలిపోతుందని ఆయన సవాలు విసిరారు. దేశంలో ప్రధాని పదవి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి మాత్రేమే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఓ మంచి పని చేస్తే అభినందించే నేత లేడు, ఓ మంచి పని చేద్దామని ప్రయత్నిస్తే సహకరించే నేత లేడని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబుకు మాత్రమే పనులు చేయగల, చేయించగల అధికారం ఉందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ఎజెండా లేదని, నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదనే తనను ఇలా మాట్లాడిస్తోందని ఆయన తెలిపారు.