: ఆటే ప్రారంభం కాలేదు...కానీ పాక్ క్రికెటర్లకు జరిమానా
ప్రపంచ కప్ పోరాటం ఇంకా ప్రారంభం కాకుండానే పాకిస్థాన్ జట్టుకు జరిమానా పడింది. టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు వీరికి ఈ జరిమానా పడింది. ఇకపై ఇలా జరిగితే టోర్నీ నుంచి బయటకు పంపేస్తామని పీసీబీ హెచ్చరించింది. మ్యాచ్ కు చాలా సమయం ఉందని భావించిన పాక్ క్రికెటర్లు నైటవుట్ కు వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం హోటల్ కు చేరాల్సిన సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ సహా 8 మందిపై జరిమానా విధించినట్టు పాక్ జట్టు మేనేజర్ నవీద్ చీమా తెలిపారు. స్నేహితులతో కలిసి రాత్రి భోజనానికి బయటకు వెళ్లిన క్రికెటర్లకు జరిమానాతో పాటు హెచ్చరికలు కూడా చేసినట్టు ఆయన వెల్లడించారు. దీంతో భవిష్యత్తులో ఇలా జరగదని పాక్ క్రికెటర్లు క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. మరోసారి ఉల్లంఘిస్తే పెట్టేబేడా సర్దేసుకుని స్వదేశం చేరాల్సి ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు. కాగా, తొలి తప్పుగా భావించిన యాజమాన్యం స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీతో పాటు ఓపెనర్ అహ్మద్ షెహజాద్ తదితరులకు 20 వేల రూపాయల చొప్పున పీసీబీ జరిమానా విధించింది.