: దళితులను మోసం చేసింది కేసీఆరే... చంద్రబాబు కాదు : మోత్కుపల్లి
దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాదని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. వరంగల్ జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎంతో ఆలోచనతో ముందుకు నడుస్తున్నారని అన్నారు. వరంగల్ నడిబొడ్డున కూర్చుని మాట్లాడే అర్హత కేవలం చంద్రబాబునాయుడికే ఉందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ లో మూడు రోజులు బస చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి పేదల భూముల్లో ఇద్దరికి ఇళ్లు కట్టిస్తానని చెప్పి వెళ్లారని గుర్తు చేశారు. ఒకరిది భూమైతే మరొకరికి ఎలా ఇళ్లు కట్టిస్తారని తాము ప్రశ్నించడంతో, మహబూబ్ నగర్ లో దానిని సరిదిద్దుకున్నాడని ఆయన వెల్లడించారు. స్వార్ధంతో వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతో చరిత్ర కలిగిన సచివాలయాన్ని అహంకారపూరితంగా మారుస్తానంటున్నాడని ఆయన మండిపడ్డారు. ఎంతో మంది పేదలకు సేవలందించిన ఛెస్ట్ ఆసుపత్రిని తరలించి, అక్కడ సచివాలయం నిర్మించడంలో ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం బలైన అమరవీరుల కుటుంబాలకు ఎంతో చేయాల్సిన అవసరం ఉండగా, టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన సూచించారు. రానున్న కాలంలో తెలంగాణలో ప్రతి ఇంటికీ ఉద్యోగం వచ్చేలా టీడీపీ చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. దళితులకు ఎన్టీఆర్, చంద్రబాబు పెద్దపీట వేశారని ఆయన తెలిపారు. వారివల్లే మాదిగ కులం పైకి వచ్చిందని ఆయన చెప్పారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.