: పాకిస్థాన్ మ్యాచ్ లో ఆడనున్న టీమిండియా జట్టు కుదిరినట్టేనా?
ప్రపంచకప్ ప్రారంభమైంది. దీంతో తొలి మ్యాచ్ పై పెద్దగా ఆసక్తి చూపని క్రీడాభిమానులు 15వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. దాయాదుల పోరుపై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఓడించి చరిత్రను తిరగరాస్తామని పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ సవాలు విసిరాడు. ప్రపంచ కప్ చరిత్రను భారత జట్టు కొనసాగిస్తుందా? లేక పాక్ కెప్టెన్ మాటల్ని నిజం చేస్తుందా? అనేది చూసేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. టీమిండియాను బౌలర్ల వైఫల్యం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కెప్టెన్ ధోనీ, సురేష్ రైనా, అజింక్యా రహానే స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. ఆల్ రౌండర్లుగా, రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రధాన బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్ లకు చోటుకల్పించనున్నారు. ప్రధాన స్పిన్నర్ పాత్ర జడేజా పోషించనుండగా, నాలుగవ సీమ్ బౌలర్ పాత్రను బిన్నీ పోషించనున్నాడు. అలా జరిగితే అంబటి తిరుపతి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ కు పరిమితం కావాల్సిందే. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై కొండంత విశ్వాసం ఉన్నప్పటికీ, బౌలింగ్ వనరులపైనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా, బౌలింగ్ వనరులు విస్తృతంగా ఉన్న పాకిస్థాన్ ను భారత బ్యాట్స్ మెన్ తట్టుకుని నిలబడగలరా? అని అభిమానులు సందేహపడుతున్నారు.